Wednesday, April 4, 2018

పేదరాశి పెద్దమ్మ

(1948 జనవరి చందమామ నుంచి)

అమ్మాయిలూ, అబ్బాయిలూ!
మీరు పేదరాసి పెద్దమ్మను గురించి ఎన్నో కథలు వినిఉంటారు. రాజుకొడుకులూ, రాజుకూతుళ్ళూ ఉండే కథల్లో సామాన్యంగా పేదరాసి పెద్దమ్మ తప్పకుండా ఉంటుంది. ఈ మనిషి ఎటువంటిదో మీరెప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. ఆలోచించినకొద్దీ ఈవిడ వింతప్రకృతి మీకే చక్కగా బోధపడుతుంది.

పేదరాసి పెద్దమ్మ కథలో అడుగుపెట్టిన క్షణం నుంచీ కథ రక్తికి వస్తుంది. రాజుకొడుకు కాని, కట్టెలుకొట్టేవాడి కొడుకు కాని, కథానాయకుడెవరైనా గానీ పేదరాసి పెద్దమ్మ ఇంటో అడుగుపెట్టాడా, వాడి కష్టాలన్నీ గట్టెక్కాయన్న మాటే! కథానాయకుడు ఎటువంటి చిక్కుల్లోనైనా ఉండనివ్వండి, వాడికి రాజుగారు ఎటువంటి పరీక్షలైనా పెట్టనివ్వండి, పేదరాసి పెద్దమ్మ వాడికి అండగా ఉండి, వాడికి అపాయం రాకుండా సంరక్షిస్తుంది.

పేదరాసి పెద్దమ్మకు తెలియని విషయం లేదు. సప్తసముద్రాల అవతల ఒక భీకరారణ్యంలో ఏడు మర్రిచెట్ల మధ్య దాని చిటారుకొమ్మన ఒక పంజరంలో చిలక కంఠంలో ఒక రాక్షసుడి ప్రాణం ఉంటుంది. దానిచుట్టూ బ్రహ్మరాక్షసులూ ఇనప కందిరీగలూ కోడెతాచులూ కాపుంటాయి. ఆ చిలకను మన కథానాయకుడు పట్టుకురావాలంటే ఎట్లావెళ్ళాలో, ఏంచేయాలో పేదరాసి పెద్దమ్మను అడిగితే చెబుతుంది.

పేదరాసి పెద్దమ్మ ఎక్కడికైనా పోగలదు. రాజుగారి అంతఃపురంలో, ఏడంతస్తుల మేడలో, పై అంతస్తున, విచ్చుకత్తుల వాళ్ళ పహరాలో రక్షించబడే రాజుకూతురిని కథానాయకుడు చూడాలి, ఎట్లా? పేదరాసి పెద్దమ్మ కథానాయకుణ్ణి తనవెంట తీసుకుపోతుంది. "వీడు మా చెల్లెలి కొడుకు" అని పేదరాసి పెద్దమ్మ చెబితే చాలు, కోటలో అడ్డేవారుండరు.

పేదరాసి పెద్దమ్మ ప్రయాణీకులకూ, దూరదేశంవారికీ తిండిపెట్టి జీవించే సామాన్యురాలు. కాని ఆమెకు యెవరి ఎక్కువాలేదు. ఆమె నేరుగా రాజుగారితో మాట్లాడుతుంది, రాణిగారితో మాట్లాడుతుంది. ఆమెనెవరూ అనుమానించరు, అవమానించరు. ఆమె సర్వస్వతంత్రురాలు. అందుకే మనకు పేదరాసి పెద్దమ్మను చూస్తే సంతోషం. 

పేదరాసి పెద్దమ్మ ప్రతివిషయంలోనూ జోక్యం కలిగించుకుంటుంది. ఎవరికీ అపకారం చెయ్యదు. అందరిమంచీ ఆమెకే అందరికన్నా బాగాతెలుసు. కథానాయకుణ్ణి చంపించటం తనకు క్షేమమనీ తన కూతుర్ని వాడు చేసుకోవటం అపకారమనీ రాజుగారు పొరపడవచ్చు. కాని నిజం పేదరాసి పెద్దమ్మకు తెలుసు. ఆవిడ తాత్కాలికంగా రాజుగారిని మోసం చేసినా, ఆ మోసంవల్ల రాజుగారికెంతో ఉపకారమే జరుగుతుంది. 

ఎంతోమందికి ఎన్నోరకాల ఉపకారం చేస్తుంది కానీ పేదరాసి పెద్దమ్మ స్వార్ధం కోరదు. ఆమెకు డబ్బు అవసరం లేదు. అందరూ కులాసాగా ఉండటమే ఆమెకు కావలసింది. ఆమెకు ప్రతిబంధకాలు లేవు, భర్త లేడు, పిల్లలు లేరు, పెద్ద డబ్బు లేదు, భవంతులు లేవు. ఆమె ఏమో, ఆమె హోటలేమో! అది నాలుగుకాలాలపాటు సాగుతూ ఉంటే, తనదగ్గరికి వచ్చినవారికి ఇంత ఉపకారం చెయ్యటంకంటే పేదరాసి పెద్దమ్మకు కావలిసింది లేదు. 

తనమూలంగా ఇంకొకడికి రాజ్యం వచ్చినా, చక్కని చుక్క అయిన రాజుకూతురు భార్యగా దొరికినా పేదరాసి పెద్దమ్మ తనకు దొరికినంతగా సంతోషిస్తుంది. తనకేమీ పేచీలు లేకపోయినా ఇతరుల పేచీలు సరిదిద్దుతుంది. తాను సామాన్యప్రజలో జత అయిన మనిషే అయినా అన్నితరగతులవాళ్ళకూ ఆశ్రయమిస్తుంది. తనధర్మాన గొప్పవాళ్ళయినాక వారిదారిన వారిని పోనిస్తుందేగాని వారి వెంటపడి తానొక ఘరానా మనిషి కావటానికి ప్రయత్నించదు.

డబ్బు విషయాలలో కూడా ఆమె ఎప్పుడూ పేచీలు పెట్టదు. ఏవేళకు వచ్చినా అన్నార్తులకింత తిండిపడేస్తుంది. కొందరు మాసాల తరబడి తన ఇంటనే ఉంటారు. కొందరు వరహాలిస్తారు, కొందరు ఏమీ ఇవ్వరు. అందరినీ పేదరాసి పెద్దమ్మ సమంగానే చూస్తుంది. ఎవరు తన ఇంటికి అతిథిగా వచ్చినా వారిపని పూర్తి అయేవరకు వాళ్ళను పొమ్మనదు. ఆమె దగ్గరికి చేరి అసంతృపి పొందే మనిషి అంటూ ఉండదు.

అటువంటి అద్భుతమయిన వ్యక్తి పేదరాసి పెద్దమ్మ.

కలవారి కోడలు

(1948 జనవరి చందమామ నుంచి)

కలవారి కోడలు కలికి కామాక్షి
కడుగుచున్నది పప్పు కడవలో పోసి
అప్పుడే ఏతెంచె ఆమె పెద్దన్న
కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు నింపె

"ఎందుకో కన్నీరు ఏమి కష్టమ్ము?
తుడుచుకో చెల్లెలా, ముడుచుకో కురులు,
ఎత్తుకో బిడ్డను, ఎక్కు అందలము,
మీ అత్తమామలకు చెప్పిరావమ్మ."

"కుర్చీపీట మీద కూర్చున్న అత్త,
మా అన్నలొచ్చారు మము బంపుతార?"
"నేనెరుగ నేనెరుగ, మీమామ నడుగు!"

"పట్టెమంచము మీద పడుకున్న మామ,
మా అన్నలొచ్చారు మము బంపుతార?"
"నేనెరుగ నేనెరుగ, మీబావనడుగు!"

"భారతము చదివేటి బావ, పెదబావ,
మా అన్నలొచ్చారు మము బంపుతార?"
"నేనెరుగ నేనెరుగ, మీఅక్కనడుగు!"

"వంట చేసే తల్లి ఓ అక్కగారూ,
మా అన్నలొచ్చారు మము బంపుతార?"
"నేనెరుగ నేనెరుగ, నీభర్తడుగు!"

"రచ్చలో వెలిగేటి రాజేంద్రభోగి,
మా అన్నలొచ్చారు మము బంపుతార?"
"పెట్టుకో సొమ్ములూ, కట్టుకో చీర,
పోయిరా సుఖముగా పుట్టింటికిని.


Monday, April 2, 2018

చదువుకున్న కాకిపిల్ల


అనగా అనగా ఒక కాకి. దానికొక పిల్ల. ఈ రోజుల్లో అందరిపిల్లలూ చదువుకుంటూ వుంటే నాపిల్లకి మాత్రం ఏమితక్కువని కాకి, పిల్లని బడికి పంపి చదువు చెప్పించింది. గొంతు బాగున్నవాళ్ళూ, బాగులేనివాళ్ళూ కూడా సంగీతం నేర్చుకోవడం చూసి, నా కూతురికి సంగీతం చెప్పిస్తానని కాకి, పిల్లకి సంగీతం చెప్పించింది. అందం ఉన్నవాళ్ళూ, లేనివాళ్ళూ కూడా నాట్యం నేర్చుకుంటూఉంటే, నా పిల్లమాత్రం తీసిపోయిందా ఏమిటని కాకి, పిల్లకు నాట్యం నేర్పించింది. ఇలా మూడు విద్యల్లో కాకి తన పిల్లని తయారుచేసింది. ఎలాగైనా, కాకిపిల్ల కాకికి ముద్దుగదా!

ఇలా వుంటూండగా, కాకిపిల్ల ఒకరోజున ఒక మాంసమ్ముక్క తెచ్చుకొని, చెట్టుకొమ్మమీద కూచుని నములుతోంది. అది ఒక నక్క చూసింది. నక్కకి జిత్తులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా. కాకిపిల్లను మోసంచేసి, ఎలాగయినా ఆ మాంసమ్ముక్క కాజేద్దామనుకుంది.

కాకిపిల్ల కూచున్న చెట్టు దగ్గరికి వెళ్ళి కాకిపిల్లను చూసి, "ఏం మరదలా, బాగా చదువుకుంటున్నావా?" అని అడిగింది. కాకిపిల్ల చదువులు నేర్చిందికదా? అంచేత నక్కజిత్తులు దానికి తెలుసు. పైగా, పూర్వం ఒక నక్క, ఒక కాకిని మోసంచేసి దానినోట్లో వున్న మాంసం ముక్కను కాజెయ్యడం కథకూడా కాకిపిల్ల రెండోక్లాసులో చదువుకుంది.

అంచేత నక్కమోసం కాకిపిల్లకి తెలుసు. నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెపితే, తను నోరు తెరవాలిసి వస్తుంది. అప్పుడు నోట్లో మాంసం ముక్క కిందపడిపోతుంది. దానిని కాస్తా నక్క నోట్లో వేసుకుపోతుంది. ఆ సంగతంతా కాకిపిల్ల చదువుకున్నది కనుక, ఆలోచించుకుని, నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అవునని తల ఊపింది.

నక్క తన ఎత్తు సాగలేదని, ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేద్దామనుకున్నది. "మరదలా, నువ్వు సంగీతం నేర్చుకున్నావుట, బాగా పాడగలవుట, నాకు సంగీతం అంటే చాలా యిష్టం. ఒక పాట పాడు మరదలా." అంది నక్క.

పొగడ్త అంటే ఎవరైనా చెవికోసుకుంటారు కదా! నక్క పొగడ్తకు కాకిపిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది. అయితే, చదువుకున్న కాకిపిల్ల కదూ! అంచేత నోట్లో ఉన్న మాంసమ్ముక్కను ముందుగానే తన కాలిగోళ్ళతో తీసి పట్టుకుని పాట పాడింది.

నక్క కోరిక పాపం, ఈసారీ నెరవేరలేదు. కాకిపిల్లను మోసంచెయ్యడం ఎలాగా అని ఆలోచించి, ఇంకాస్త పెద్ద యెత్తు వేద్దామని, ఇలా అంది. "మరదలా, ఎంత బాగా పాట పాడేవే! ఆహాహా, నా చెవుల తుప్పు వదిలిపోయిందే! కాని, ఇంకొక్క కోరిక కూడా తీరుద్దూ. నువ్వు నాట్యం నేర్చుకున్నావుట. చాలా బాగా నాట్యం చేస్తావుట. ఒక్కసారి నాట్యం చేద్దూ, చూసి ఆనందిస్తాను."

ఈమాటలు వినేటప్పటికి కాకిపిల్ల ఉబ్బితబ్బిబ్బయిపోయింది. తన సంగీతాన్నీ నాట్యాన్నీ మెచ్చుకునేవాళ్ళు ఎవరూ లేరనుకుంటూ వుంటే, నక్కబావ యింతగా మెచ్చుకుంటున్నాడు. నక్కబావను సంతృప్తి పరచాలనుకుంది. అయితే మరి, మాంసమ్ముక్క మాటో? చదువుకున్న కాకిపిల్ల కదా! అంచేత, ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు.

అందుకని బాగా ఆలోచించి గోళ్ళతో పట్టుకున్న మాంసమ్ముక్కను మళ్ళీ నోట్లో పెట్టుకుని, నాట్యం చేసింది.

కాకిపిల్ల నాట్యంచేస్తూవున్నంతసేపూ, నక్కకు ఒకటే ఆలోచన. ఆ మాంసమ్ముక్కనెలా కాజేద్దామా అని. ఇంతకూ దాని ఎత్తు పారనేలేదు. కాకిపిల్ల నాట్యం అయినతరువాత నక్క ఆఖరి యెత్తు వేద్దామని, ఇలా అంది. "మరదలా! ఆహాహా. ఎంత మంచి పాట పాడావు, ఎంత బాగా నాట్యం చేశావు! నిజంగా ఇవ్వాళ నాకు సుదినం. అయితే, ఇంకొక్క చిన్న కోరిక వుంది. ఆకాస్తా తీర్చావంటే, అపరిమితమయిన ఆనందంతో ఇంటికి వెడతాను. ఇవ్వాళ నేను పొందే తృప్తికి, ఇహ నాకు యీనాటికి అన్నంకూడా అక్కరలేదు. అయితే మరదలా, ఆ కోరిక ఏమిటంటే, నీ ఆటా నీ పాటా కలిసి చూడాలనివుంది. పాటపాడుతూ నాట్యంచెయ్యి మరదలా! హాయిగా ఆనందిస్తాను."

కాకిపిల్ల, నక్కపొగడ్తకు చెప్పలేనంత పొంగిపోయింది. కాని పాటపాడుతూ నాట్యం చేస్తే, మాంసమ్ముక్కని ఏం చెయ్యాలి? చదువుకున్న కాకిపిల్ల కదా! ఆలోచించి నక్కబావతో ఇలా అంది.

"నక్కబావా! పాడీ, నాట్యంచేసీ ఇప్పటికే అలసిపోయాను. ఇంకా పాటపాడుతూ నాట్యంచెయ్యాలంటే, వంట్లో శక్తి ఉండాలి కదా! అంచేత, యీ మాంసమ్ముక్కను కాస్తా తిని, నీ కోరిక తీరుస్తాను వుండు."

ఈ మాటలు వినేటప్పటికి నక్కకు, ఇక లాభం లేదనిపించింది. ఆ మాంసమ్ముక్క కోసమే కదా కర్ణకఠోరమైన కాకిపిల్ల పాట విన్నదీ, అసహ్యమైన నాట్యాన్ని చూసిందీ అనుకొని, "మరదలా, మళ్ళీ వస్తాను. ఈలోపల నువ్వు మాంసమ్ముక్క తినడం కానీ" అని చెప్పి బయలుదేరింది.

కానీ కాకిపిల్ల అంతటితో వదులుతుందా? మాంసమ్ముక్క గుటుక్కున మింగి, పోతున్న నక్కబావని నిలేసి, సంగీతం పాడుతూ నాట్యం చెయ్యసాగింది. నక్కబావకి బుద్ధి వచ్చింది.