Thursday, March 5, 2009

శ్రీ సూర్య నారాయణా !


శ్రీ సూర్య నారాయణా మేలుకో
హరి సూర్య నారాయణా !

పుట్టేటి భానుడూ, పుష్యరాగపుచాయ
పుష్యరాగము మీద పొంగు బంగరుచాయ

శ్రీ సూర్య నారాయణా మేలుకో
హరి సూర్య నారాయణా !

జామెక్కి భానుడూ జాజిపువ్వులచాయ
జాజిపువ్వుల మీద సంపెంగపువుచాయ

శ్రీ సూర్య నారాయణా మేలుకో
హరి సూర్య నారాయణా !

మధ్యాహ్న భానుడూ మల్లెపూవులచాయ
మల్లెపూవుల మీద మంచి వజ్రపుచాయ

శ్రీ సూర్య నారాయణా మేలుకో
హరి సూర్య నారాయణా !

ముజ్జాము భానుడూ మునగపూవులచాయ
మునగపువ్వుల మీద ముత్యాల పొడిచాయ

శ్రీ సూర్య నారాయణా మేలుకో
హరి సూర్య నారాయణా !

క్రుంగేటి భానుడూ గుమ్మడీపూచాయ
గుమ్మడీపువు మీద కుంకుమాపొడిచాయ

శ్రీ సూర్య నారాయణా మేలుకో
హరి సూర్య నారాయణా !

ఆయురారోగ్యములు ఐశ్వర్యములనిమ్ము
శ్రీ సూర్య నారాయణా మేలుకో
హరి సూర్య నారాయణా !

Tuesday, March 3, 2009

పొట్టి పిచిక

అనగా అనగా వో వూర్లో ఒక పొట్టి పిచిక ఉండేది. అదేం చేసిందీ, ఊరల్లా తిరిగి ఉలవ గింజ, చేనల్లా తిరిగి సెనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ, ఇల్లాంటివి ఎన్నోగింజలు పోగుచేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టి చేసుకుంది. చేసుకుని, చింత చెట్టు మీద కూర్చుని ఆ పిచిక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ తింటూ ఉంటే, చీమ తలకాయంత రొట్టెముక్క చెట్టు తొర్రలో పడిపోయింది.

అప్పుడా పిచిక ఏం చేసిందీ, వడ్రంగి దగ్గరికి వెళ్ళి, "వడ్రంగీ, వడ్రంగీ, అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటూంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయిందోయ్! చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్" అంది.

వడ్రంగి, "చీమ తలకాయంత ముక్కకై చెట్టు కొట్టాలా?" అని పక పక నవ్వాడు.

అప్పుడా పిచిక కెంతో కోపం వచ్చి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి, "రాజుగారూ, రాజుగారూ, అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకుని తింటూంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది, తీసి పెట్టమని వడ్రంగి నడిగితే తీయనన్నాడు. వడ్రంగిని దండించు రాజా" అంది.

రాజు కూడా నవ్వి, "ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా? దండించను పో" అన్నాడు రాజు.

"అమ్మా, వీడి పని ఇలా ఉందా?" అని ఆ పిచిక వెంటనే లేళ్ళ దగ్గరికి వెళ్ళి, జరిగింది చెప్పి, "చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు. వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు. రాజుకు ఉద్యానవనమంటే ఎంతో ఇష్టం. అది పాడు చెయ్యండి లేళ్ళూ" అంది.

"ఈ చీమ తలకాయంత రొట్టి ముక్కకి చక్కటి రాజు పూలతోట పాడు చేస్తామా? చాలు చాలు పో" అన్నాయి లేళ్ళు.

"అమ్మా! వీటమ్మ కడుపు కాలా! ఈ వెధవ లేళ్ళకు ఇంత తెగులా?" అని ఆ పిచిక ఏం చేసిందీ, బోయవాడి దగ్గరికి వెళ్ళి, "బోయాడూ, బోయాడూ, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది. తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు. వడ్రంగి ని దండించమంటే రాజలా చెయ్యలేదు. రాజు పూలతోట పాడు చెయ్యమంటే లేళ్ళు పాడుచెయ్యలేదు. లేళ్ళ కాళ్ళు విరక్కొట్టు బోయాడూ!" అంది.

ఇదంతా విని బోయవాడు, "ఈ పాటి భాగ్యానికి చెంగు చెంగని గెంతే లేళ్ళ కాళ్ళను విరక్కొట్టనా? బాగానే ఉంది, వెళ్ళు వెళ్ళు" అని పంపేసాడు.

దాంతో పిచ్చిక్కి కోపమెక్కువై ఎలక దగ్గరికి వెళ్ళి, "ఓయ్ ఎలకా, ఎలకా, ఓ సహాయం చేసి పెట్టాలి. చీమ తలకాయంత రొట్టి చింత చెట్టు తొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు. వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు. రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు. లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు. బోయవాడి చెప్పులు కొరికి పాడు చెయ్యి ఎలకా" అంది.

ఎలక కూడా "నా వల్ల కాదు పొ"మ్మని అంది.

"అమ్మ దొంగ ముండా. నీకెంత గర్వమే?" అని పిల్లి దగ్గరికి వెళ్ళి, "పిల్లి బావా, పిల్లి బావా. చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పటిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు. వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు. రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు. లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు. బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు. ఎలుకను వేటాడు పిల్లీ" అంది.

"నాకిప్పుడు చాలా పనులున్నాయ్. ఇదే పనా ఏమిటి?" అని పిల్లి వెళ్ళిపోయింది.

"అయ్యో దీని దర్జా మండా! ఉండు దీని పని పడతాను" అని తిన్నగా అవ్వ దగ్గరికెళ్ళి, "అవ్వా అవ్వా, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు. వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు. రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు. లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు. బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు. పిల్లి ఎలకను వేటాడలేదు. పిల్లి మీద వేడి వేడి పాలు పొయ్యి అవ్వా" అంది.

"చీమ తలకాయంత రొట్టి ముక్క కోసం పిల్లి మీద పాలోస్తానూ? చాలు చాల్లే" అని అవ్వ కసిరి పొమ్మంది.

"ఏమి తూలిపోతున్నావే మామ్మా!" అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి, "చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు. వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు. రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు. లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు. బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు. పిల్లి ఎలకను వేటాడలేదు. అవ్వ పిల్లి మీద వేడి పాలొయ్యలేదు. అవ్వను చితక్కొట్టు తాతా" అంది.

"అమ్మో నేనలా చేస్తానా? చెయ్యను పో" అన్నాడు తాత.

"ఓహో నీకింత గర్వమా? సరే" అని ఆ పిచికేం చేసిందీ, గబ గబా ఆవు దగ్గరికి వెళ్ళి, "ఆవు పిన్నీ, ఆవు పిన్నీ, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలొ పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు. వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు. రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు. లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటె బోయ విరక్కొట్టాడు కాదు. బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు. పిల్లి ఎలకను వేటాడలేదు. పిల్లి మీద అవ్వ వేడి పాలొయ్యలేదు, తాత అవ్వను చితక్కొట్టలేదు. తాత పాలు తియ్యడానికొచ్చినప్పుడు ఫెడీ మని తన్ను ఆవూ" అంది.

"అబ్బే, నేనలా చెయ్యను సుమా" అంది ఆవు.

అప్పుడు పిచిక విచారిస్తూ, "పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో. ఎవళ్ళనడిగినా ఏమీ చెయ్యనంటున్నారు ఎలాగో" అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతట్లో ఒక ఈగ ఆ దారమ్మట వెడుతూ "ఏం పిచికా ఏడుస్తున్నావు?" అనడిగింది. పిచిక జరిగినదంతా చెప్పి ఉపకారము చేసి పెట్టమంది.

అప్పుడు ఈగ ఏం చేసిందీ, వెంటనే వెళ్ళి ఆవు చెవిలో దూరి నానా అల్లరీ చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాతకి కోపం వచ్చి అవ్వని చితక కొట్టాడు. అవ్వకు వొళ్ళు మండి, పిల్లి మీద వేడి పాలోసింది. పిల్లి కోపం కొద్దీ ఎలక వెంట పడింది. ఎలక భరించలేక బోయవాడి చెప్పులు కొరికింది. బోయవాడు ఆ కోపం తీర్చుకోడానికి లేళ్ళ కాళ్ళను విరక్కొట్టాడు. లేళ్ళు కోపం చేత రాజు గారి తోటను పాడు చేసాయి. రాజుకి బుధ్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చినట్టు, చెట్టును నరికి తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టి ముక్కనూ తీసి పిచిక చేతిలొ పెట్టాడు. పిచిక మళ్ళీ ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది.

కథ కంచికి, మనమింటికి.