Monday, April 13, 2009

మే మే మేకపిల్ల

అనగనగా ఉఫ్ ఫ్ అని ఒక ఎర్రటి మేక ఉండేది. ఆ మేకకు నాలుగు పిల్లలు పుట్టాయి. నాలుగు పిల్లలలోనూ మూడు తల్లి పోలిక. కడసారిది మాత్రం కారు నలుపు. దీనికి మేమే-మేకపిల్ల అని పేరు. ఈ సంతతిలో మూడు పిల్లలూ తల్లి చెప్పిన మాట విని బుధ్ధిగా ఉండేవి. కానీ మేమే-మేకపిల్ల మాత్రం గడుగ్గాయిగా తిరుగుతూ తగని అల్లరి చేస్తూ ఉండేది. ఇంటి మీదకి రోజుకొక తగువు తెచ్చేది.

ఒక రోజున మేమే-మేకపిల్ల తల్లి దగ్గరికి వెళ్ళి, "అమ్మా అమ్మా! నాకు ఢిల్లీ సుల్తానుని చూచి రావాలెనని ఉన్నది. మనిద్దరం కలిసి వెళదాము. లే, బయలుదేరు" అన్నది.

దానికి తల్లిమేక "పాపా! ఇప్పుడు నాకు చేతి నిండా బోలెడంత పని ఉన్నది. అదీ గాక, ఇంత చిన్నవాళ్ళేమిటి, ఢిల్లీ వెళ్ళడమేమిటి, సుల్తానుని చూడడమేమిటి? మీరు పెద్దవాళ్ళయిన తరవాత అందరం కలిసి వెళదాములే" అని చెప్పింది.

"ఆ( ? పెద్దయేవరకూ ఎవరు ఆగుతారేమిటి? వస్తే ఇప్పుడు రండి, లేకపోతే పొండి. మీ ఇష్టం. ఇదుగో నేను బయలుదేరి పోతున్నాను", అని మేమే-మేకపిల్ల రోడ్డు మీదకి పరుగెత్తింది.

అటువంటి అల్లరి పిల్లలతో ఏం చేసేది? "సరే అనుభవించు. నీ ప్రారబ్ధం. నిన్ను కన్నాను గానీ నీ రాతను కనలేదు గదా" అని విచారించింది తల్లి మేక.

మేమే-మేకపిల్ల పాడుకుంటూ గెంతులేస్తూ పోతూవుండగా దారిలో ఒక యేరు అడ్డం వచ్చింది. ఏరు మేకపిల్లను చూసి, "మేకపిల్లా మేకపిల్లా! నా పైన ఎవరో కొమ్మ అడ్డం పడవేసి పోయినారు. అది నాకు బరువైపోయి నడవలేకుండా ఉన్నాను. దానిని కాస్త నమిలేసి పో తల్లీ, నీకు పుణ్యం ఉంటుంది" అని బతిమాలింది.

"పాపం, రమ్మన్నారు తిమ్మన్న బంతికి. కొమ్మలు తినడమే పని అనుకున్నావా నాకు? ఢిల్లీకి పోవాలి, సుల్తానుని చూడాలి. ఇప్పుడు నాకు తీరిక లేదు" అని చెప్పేసి మేమే-మేకపిల్ల మళ్ళీ పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది.

మరి కొంత దూరం వెళ్ళేసరికి, ఒక మండుతున్న మంట కనపడి, "మేకమ్మా మేకమ్మా! నేను ఆరిపోబోతున్నాను. అల్లదిగో నీ కాలిదగ్గర ఒక పుల్ల ఉంది. దాన్నిలా పడవేసి పో తల్లీ, నీకు పుణ్యముంటుంది" అని బతిమాలింది.

"ఈ పుల్ల పడేస్తాననుకో, ఎల్ల కాలం మండుతూనే ఉంటావా? మళ్ళీ ఇంకో పుల్ల వెయ్యమంటావు. నాకిదే పననుకున్నావా యేం? ఢిల్లీ పోయి సుల్తానుని చూడాలి నేను. నాకిప్పుడు తీరిక లేదు" అని చెప్పేసి మేమే-మేకపిల్ల పరుగెత్తిపోయింది.

మర్కొంచెం దూరం పోయేసరికి, ఒక చెట్టుకింద గాలి కనపడింది. "మేకపిల్లా మేకపిల్లా! ఈ చెట్టుకి ఎవళ్ళో ముళ్ళాకంచె కట్టారు. అది నా వీపుకి గుచ్చుకుంటున్నది. ఊపిరి పీల్చుకోలేకుండా ఉన్నాను. దాన్ని కాస్త లాగిపారెయ్యి తల్లీ. నీకు బోలెడు పుణ్యమొస్తుంది" అని బతిమలాడింది గాలి.

"ఢిల్లీ పోయి సుల్తానుని చూసే పనిలో ఉన్నా నేనిప్పుడు. ఆగడానికి వల్ల కాదు. నీ తిప్పలు నువ్వు పడు" అనేసి గంతులేసుకుంటూ వెళ్ళిపోయింది మేమే-మేకపిల్ల.

వెళ్ళి వెళ్ళి మేమే-మేకపిల్ల చివరికి ఢిల్లీ సుల్తాను కోట చేరుకున్నది. ఆ దారిని పోతూవున్న మనిషిని పిలిచి "సుల్తాను ఎక్కడ వున్నాడు? నేను చూడాలి" అని అడిగినది. అతను సుల్తాను గారి వంటల సాయిబు. "రా, రా, నీకు సుల్తాను గారు కావాలా? నేను చూపిస్తాను రా" అంటూ పకపక నవ్వి మేమే-మేకపిల్లను వంటింట్లోకి లాగుకొనిపోయాడు. అతను పొయ్యి రాజవేసి, పెద్ద డేగిశాడు నీళ్ళూ పెట్టి, అందులో మేకపిల్లని ఉంచి, డేగిశా మూసిపోయాడు.

పాపం, మేమే-మేకపిల్లకి భయం పట్టుకుంది. నీళ్ళవైపు చూసి, "నీళ్ళూ, నీళ్ళూ! మీరు కాగబోకండి. మీరు కాగారంటే నేను ఉడికి చచ్చిపోతాను" అని బతిమాలింది.

"మాకు కష్టం వచ్చినప్పుడు ఆర్చావా? తీర్చావా? మేము కాగేది కాగేదే" అని నీళ్ళు బుడ బుడ కాగడం మొదలుపెట్టాయి.

అప్పుడు మేకపిల్ల నిప్పువంక చూసి, "నిప్పా నిప్పా! నువ్వు రాజుకోవద్దు. నువ్వు మండినావంటే నేను వొళ్ళూ కాలి చచ్చిపోతాను" అని బతిమలాడింది.

"ఒక పుల్ల వేస్తే కలకాలం మండుతావా అని నన్ను ఎద్దేవా చేసావు కదా, నేను మండక మానుతానా?" అనేసి నిప్పు భుగ భుగ మండసాగింది.

చివరకు మేకపిల్ల గాలితో "గాలీ, గాలీ! నువ్వు వీచవద్దు. నీవు వీచితే నిప్పు మండుతుంది.నిప్పు మండితే నీళ్ళు కాగుతై. నీళ్ళు కాగితే నేను వళ్ళు కాలి చచ్చిపోతాను. నా మీద దయ తలచవా?" అని బతిమాలింది.

గాలికి మేకపిల్ల మీద జాలి కలిగింది. "ఇందాక దారిలో నేను నిన్ను సహాయం చెయ్యమని అడిగితే 'అబ్బో నాకు పని వుందీ అని పరిగెత్తుకు పారిపోయావ్. ఇప్పుడు నీకే నా సహాయం కావలసొచ్చింది, చూసావా పాపా! ఏ వేళకు ఎవళ్ళ అవసరం వస్తుందో! అందుచేత ప్రపంచంలో ఎవళ్ళతోనూ విరోధం పెట్టుకోకూడదు. ఇప్పుడైనా ఇంక బుధ్ధి తెచ్చుకుని, వీలైనప్పుడల్లా ఒకళ్ళకు ఉపకారం చేయటం నేర్చుకో. మిడిసిపడి ఎవళ్ళమాటా నిర్లక్ష్యం చెయ్యకు" అని అనేకవిధాల బోధచేసి గాలి వీచటం మానేసింది. గాలి కదలకుండా వుండేసరికి మంట ఆరిపోయింది. మంట ఆరిపోయేసరికి నీళ్ళు చల్లబడిపోయాయి.

ఇంతలో వంటల సాయిబు వచ్చి మళ్ళీ డేగిశా కిందకి దింపి, నీళ్ళు ఎంత వెచ్చబడ్డాయో చూతామని మూత తీశాడు. మూత తీసీతీయడంతోనే మేమే-మేకపిల్ల గభీమని డేగిశాలోంచి దూకి తుర్రుమని ఇంటికి పారిపోయింది. ఇంటికి వెళ్ళి మేకపిల్ల జరిగినదంతా తల్లితో చెప్పింది.

పాపకు గండం తప్పినందుకూ, గాలి బోధవల్ల పెంకితనం అణగి బుధ్ధి వచ్చినందుకూ తల్లి చాలా సంతోషించింది.

కథ కంచికి మనమింటికి.

14 comments:

  1. once again, you're posting cool stories.It almost feels like reading chandamama again.

    didn't understand what" getting back to the mothership" means in your other blog. you meant you will stop blogging ?If so, very very sad, as you write really well.

    ReplyDelete
  2. Thank you. I was just feeling homesick (for India), Mothership for me is India.

    ReplyDelete
  3. hahaha, dont think anyone could guess that, with that post :-)

    Hope you can get a chance to come home soon ! So you could taste konaseema food again !

    Please keep writing !

    ReplyDelete
  4. knock, knock ! we, kids need some more chandamama stories !

    please, please tell us one more story !

    ReplyDelete
    Replies
    1. Stay tuned. New story every week from now on.

      Delete
  5. మీ చందమామ కధలకు కాపీ రైట్స్ ఉన్నాయా? నేను కపీ కొట్టుకోవచ్చా?
    మీరు నా వంటలవైపు చూడటమే మానేసారే..:):)పోనీలేండి..

    ReplyDelete
  6. చందమామ కథలకి copyright చందమామదే :-) సో నిరభ్యంతరంగా కాపీ కొట్టుకోవచ్చు. మీ దోసకాయ పప్పుని ఇవాళే చూసాను. ఈ మధ్య వంటలు ఎక్కువగా చెయ్యట్లేదు, అదీ కారణం:-P

    ReplyDelete
  7. idi own story ah? chandamama daggara nunchi kottesinda? :P

    ReplyDelete
  8. Replies
    1. This story is taken from Chandamama in 1948. Not my own.

      Delete
  9. కథ చాలా చాలా బావుంది.ఇలాంటి కథలు ఈ తరం పసి వాళ్లకు బోలెడు కావాలి. ఈ రోజుకి ఈ కథ నాది, మా పాపదీనూ! రాత్రికి చెప్పుకోవాలి మరి!

    "రమ్మన్నారు తిమ్మన్న బంతికి.."ఎన్ని రోజులైందో ఈ మాటవిని.చిన్నప్పుడు ప్రతి దానికీ "కుదరదు" అని చెప్పడానికి ఈ మాట వాడేస్తూ ఉండేవాళ్ళం!

    ReplyDelete
  10. వావ్! భలే ఉందండీ ఈ కథ! ఇది చందమామలో కథా? మీరీ వ్రాశారా? లేక మీరు వ్రాసిన చందమామ కథా? అర్థం కాలేదు ఏమయితేనేం చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. రసఙ్ఞ గారు, చందమామ లోని కథ. నేను రాసింది కాదు.

      Delete