Tuesday, March 3, 2009

పొట్టి పిచిక

అనగా అనగా వో వూర్లో ఒక పొట్టి పిచిక ఉండేది. అదేం చేసిందీ, ఊరల్లా తిరిగి ఉలవ గింజ, చేనల్లా తిరిగి సెనగ్గింజ, పెరడల్లా తిరిగి పెసరగింజ, ఇల్లాంటివి ఎన్నోగింజలు పోగుచేసుకొని కొట్టి కొట్టి కొండంత రొట్టి చేసుకుంది. చేసుకుని, చింత చెట్టు మీద కూర్చుని ఆ పిచిక ఆ రొట్టెను ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ తింటూ ఉంటే, చీమ తలకాయంత రొట్టెముక్క చెట్టు తొర్రలో పడిపోయింది.

అప్పుడా పిచిక ఏం చేసిందీ, వడ్రంగి దగ్గరికి వెళ్ళి, "వడ్రంగీ, వడ్రంగీ, అతి కష్టపడి కొండంత రొట్టె చేసుకుని తింటూంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయిందోయ్! చెట్టు కొట్టి అది తీసి పెట్టాలోయ్" అంది.

వడ్రంగి, "చీమ తలకాయంత ముక్కకై చెట్టు కొట్టాలా?" అని పక పక నవ్వాడు.

అప్పుడా పిచిక కెంతో కోపం వచ్చి తిన్నగా రాజు దగ్గరికి వెళ్ళి, "రాజుగారూ, రాజుగారూ, అతి కష్టపడి కొండంత రొట్టి చేసుకుని తింటూంటే చీమ తలకాయంత ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది, తీసి పెట్టమని వడ్రంగి నడిగితే తీయనన్నాడు. వడ్రంగిని దండించు రాజా" అంది.

రాజు కూడా నవ్వి, "ఇంత చిన్న పనికి వడ్రంగిని దండించాలా? దండించను పో" అన్నాడు రాజు.

"అమ్మా, వీడి పని ఇలా ఉందా?" అని ఆ పిచిక వెంటనే లేళ్ళ దగ్గరికి వెళ్ళి, జరిగింది చెప్పి, "చెట్టు కొట్టమంటే వడ్రంగి కొట్టనన్నాడు. వడ్రంగిని దండించమంటే రాజు దండించలేదు. రాజుకు ఉద్యానవనమంటే ఎంతో ఇష్టం. అది పాడు చెయ్యండి లేళ్ళూ" అంది.

"ఈ చీమ తలకాయంత రొట్టి ముక్కకి చక్కటి రాజు పూలతోట పాడు చేస్తామా? చాలు చాలు పో" అన్నాయి లేళ్ళు.

"అమ్మా! వీటమ్మ కడుపు కాలా! ఈ వెధవ లేళ్ళకు ఇంత తెగులా?" అని ఆ పిచిక ఏం చేసిందీ, బోయవాడి దగ్గరికి వెళ్ళి, "బోయాడూ, బోయాడూ, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పడిపోయింది. తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు. వడ్రంగి ని దండించమంటే రాజలా చెయ్యలేదు. రాజు పూలతోట పాడు చెయ్యమంటే లేళ్ళు పాడుచెయ్యలేదు. లేళ్ళ కాళ్ళు విరక్కొట్టు బోయాడూ!" అంది.

ఇదంతా విని బోయవాడు, "ఈ పాటి భాగ్యానికి చెంగు చెంగని గెంతే లేళ్ళ కాళ్ళను విరక్కొట్టనా? బాగానే ఉంది, వెళ్ళు వెళ్ళు" అని పంపేసాడు.

దాంతో పిచ్చిక్కి కోపమెక్కువై ఎలక దగ్గరికి వెళ్ళి, "ఓయ్ ఎలకా, ఎలకా, ఓ సహాయం చేసి పెట్టాలి. చీమ తలకాయంత రొట్టి చింత చెట్టు తొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు. వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు. రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు. లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు. బోయవాడి చెప్పులు కొరికి పాడు చెయ్యి ఎలకా" అంది.

ఎలక కూడా "నా వల్ల కాదు పొ"మ్మని అంది.

"అమ్మ దొంగ ముండా. నీకెంత గర్వమే?" అని పిల్లి దగ్గరికి వెళ్ళి, "పిల్లి బావా, పిల్లి బావా. చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పటిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు. వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు. రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు. లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు. బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు. ఎలుకను వేటాడు పిల్లీ" అంది.

"నాకిప్పుడు చాలా పనులున్నాయ్. ఇదే పనా ఏమిటి?" అని పిల్లి వెళ్ళిపోయింది.

"అయ్యో దీని దర్జా మండా! ఉండు దీని పని పడతాను" అని తిన్నగా అవ్వ దగ్గరికెళ్ళి, "అవ్వా అవ్వా, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు. వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు. రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు. లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు. బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు. పిల్లి ఎలకను వేటాడలేదు. పిల్లి మీద వేడి వేడి పాలు పొయ్యి అవ్వా" అంది.

"చీమ తలకాయంత రొట్టి ముక్క కోసం పిల్లి మీద పాలోస్తానూ? చాలు చాల్లే" అని అవ్వ కసిరి పొమ్మంది.

"ఏమి తూలిపోతున్నావే మామ్మా!" అని తిన్నగా తాతయ్య దగ్గరికి వెళ్ళి, "చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలో పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు. వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు. రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు. లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటే బోయ విరక్కొట్టాడు కాదు. బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు. పిల్లి ఎలకను వేటాడలేదు. అవ్వ పిల్లి మీద వేడి పాలొయ్యలేదు. అవ్వను చితక్కొట్టు తాతా" అంది.

"అమ్మో నేనలా చేస్తానా? చెయ్యను పో" అన్నాడు తాత.

"ఓహో నీకింత గర్వమా? సరే" అని ఆ పిచికేం చేసిందీ, గబ గబా ఆవు దగ్గరికి వెళ్ళి, "ఆవు పిన్నీ, ఆవు పిన్నీ, చీమ తలకాయంత రొట్టి ముక్క చెట్టు తొర్రలొ పడిపోతే తియ్యమంటే వడ్రంగి తీసాడు కాదు. వాడిని దండించమంటే రాజలా చేసాడు కాదు. రాజుగారి పూలతోటను పాడు చెయ్యమంటే లేళ్ళలా చేసాయి కాదు. లేళ్ళ కాళ్ళు విరక్కొట్టమంటె బోయ విరక్కొట్టాడు కాదు. బోయ చెప్పులు కొరకమంటే ఎలక కొరికింది కాదు. పిల్లి ఎలకను వేటాడలేదు. పిల్లి మీద అవ్వ వేడి పాలొయ్యలేదు, తాత అవ్వను చితక్కొట్టలేదు. తాత పాలు తియ్యడానికొచ్చినప్పుడు ఫెడీ మని తన్ను ఆవూ" అంది.

"అబ్బే, నేనలా చెయ్యను సుమా" అంది ఆవు.

అప్పుడు పిచిక విచారిస్తూ, "పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసానో. ఎవళ్ళనడిగినా ఏమీ చెయ్యనంటున్నారు ఎలాగో" అని ఏడుస్తూ కూర్చుంది. ఇంతట్లో ఒక ఈగ ఆ దారమ్మట వెడుతూ "ఏం పిచికా ఏడుస్తున్నావు?" అనడిగింది. పిచిక జరిగినదంతా చెప్పి ఉపకారము చేసి పెట్టమంది.

అప్పుడు ఈగ ఏం చేసిందీ, వెంటనే వెళ్ళి ఆవు చెవిలో దూరి నానా అల్లరీ చేసింది. ఆవు ఆ బాధ భరించలేక తాతని తన్నింది. తాతకి కోపం వచ్చి అవ్వని చితక కొట్టాడు. అవ్వకు వొళ్ళు మండి, పిల్లి మీద వేడి పాలోసింది. పిల్లి కోపం కొద్దీ ఎలక వెంట పడింది. ఎలక భరించలేక బోయవాడి చెప్పులు కొరికింది. బోయవాడు ఆ కోపం తీర్చుకోడానికి లేళ్ళ కాళ్ళను విరక్కొట్టాడు. లేళ్ళు కోపం చేత రాజు గారి తోటను పాడు చేసాయి. రాజుకి బుధ్ధి వచ్చి వడ్రంగిని శిక్షించాడు. వడ్రంగి చచ్చినట్టు, చెట్టును నరికి తొర్ర తవ్వి ఆ చీమ తలకాయంత రొట్టి ముక్కనూ తీసి పిచిక చేతిలొ పెట్టాడు. పిచిక మళ్ళీ ఎగరేసుకుంటూ ఎగరేసుకుంటూ ఆ రొట్టె ముక్కను కమ్మగా తిన్నది.

కథ కంచికి, మనమింటికి.


8 comments:

  1. బాగుంది బాలేదు
    బాగుంది: మీ రాసిన శైలి. నాకు ఇటువంటి కధలంటే భలే ఇష్టం. ఇంకా కావాలి.
    బాలేదు: వత్తులు, వాడిన ఫాంటు.

    వర్డ్ వెరిఫికేషన్ వద్దు.



    - కిరణ్
    ఐతే OK

    ReplyDelete
  2. నాకు కొంచెం గుడ్డి వుంది దయచేసి మీరు మీ అక్షరాల పరిమాణం పెంచితే ప్రశాంతం గా చడువుకోగాలను.....తర్వాత అనందించగాలను కూడా......

    ReplyDelete
  3. Loved the story ! Reminds us of childhood days, when 'chandamama kathalu' were everyone's favourite. Expecting more stories from you in your wonderful narrative style.

    Could you please not use bold letters and increase font size ? I know how to increase font size myself, but cant deal with bold letters !

    Anu garu, you could use ctrl + plus sign or go to view in your browser and use zoom options, for making the font look larger !

    ReplyDelete
  4. If you can, can you please keep some audio for eladeti roda blog of your's ?It's good to see lyrics in sweet telugu !

    Liked your other blog, life, too ! Please keep writing more often in telugu !

    ReplyDelete
  5. మీ పొట్టి పిచ్చుక కథ చాలా బాగుంది. కొంచెం సాగదీసినట్లనిపించినా కథాగమనం బాగుంది.

    ReplyDelete
  6. waiting for your next story, meanwhile enjoy this

    http://www.youtube.com/watch?v=bGiaERvxYmw&feature=related

    ReplyDelete
  7. కథ చివ్వరిదాకా చాలా బాగా నచ్చింది, కానీ చివరిలో ఈగ చెట్టు తొఱ్ఱలో దూరి ఆ ముక్కని తీసి పెట్టడమో, లేదా ఆ చిన్న విషయానికి అంత చెడు చేయాలి అని అనుకున్న పిచిక ఆలోచన తప్పు అని చెప్పించాతమో చేస్తే బాగుండును అనిపించింది. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే, అన్యధా భావించరని ఆశిస్తూ... మీ నుండీ మరిన్ని కథల కోసం ఎదురు చూస్తున్నా

    ReplyDelete
  8. ఈ కధలలో 90% పాత చందమామ పత్రికల లోంచి తెచ్చినవే. నా స్వంత కధలు యేమైనా ఉంటే, వాటిపక్కన నా పేరు వేశాను.

    ReplyDelete