Wednesday, April 4, 2018

పేదరాశి పెద్దమ్మ

(1948 జనవరి చందమామ నుంచి)

అమ్మాయిలూ, అబ్బాయిలూ!
మీరు పేదరాసి పెద్దమ్మను గురించి ఎన్నో కథలు వినిఉంటారు. రాజుకొడుకులూ, రాజుకూతుళ్ళూ ఉండే కథల్లో సామాన్యంగా పేదరాసి పెద్దమ్మ తప్పకుండా ఉంటుంది. ఈ మనిషి ఎటువంటిదో మీరెప్పుడైనా ఆలోచించారా? ఆలోచించండి. ఆలోచించినకొద్దీ ఈవిడ వింతప్రకృతి మీకే చక్కగా బోధపడుతుంది.

పేదరాసి పెద్దమ్మ కథలో అడుగుపెట్టిన క్షణం నుంచీ కథ రక్తికి వస్తుంది. రాజుకొడుకు కాని, కట్టెలుకొట్టేవాడి కొడుకు కాని, కథానాయకుడెవరైనా గానీ పేదరాసి పెద్దమ్మ ఇంటో అడుగుపెట్టాడా, వాడి కష్టాలన్నీ గట్టెక్కాయన్న మాటే! కథానాయకుడు ఎటువంటి చిక్కుల్లోనైనా ఉండనివ్వండి, వాడికి రాజుగారు ఎటువంటి పరీక్షలైనా పెట్టనివ్వండి, పేదరాసి పెద్దమ్మ వాడికి అండగా ఉండి, వాడికి అపాయం రాకుండా సంరక్షిస్తుంది.

పేదరాసి పెద్దమ్మకు తెలియని విషయం లేదు. సప్తసముద్రాల అవతల ఒక భీకరారణ్యంలో ఏడు మర్రిచెట్ల మధ్య దాని చిటారుకొమ్మన ఒక పంజరంలో చిలక కంఠంలో ఒక రాక్షసుడి ప్రాణం ఉంటుంది. దానిచుట్టూ బ్రహ్మరాక్షసులూ ఇనప కందిరీగలూ కోడెతాచులూ కాపుంటాయి. ఆ చిలకను మన కథానాయకుడు పట్టుకురావాలంటే ఎట్లావెళ్ళాలో, ఏంచేయాలో పేదరాసి పెద్దమ్మను అడిగితే చెబుతుంది.

పేదరాసి పెద్దమ్మ ఎక్కడికైనా పోగలదు. రాజుగారి అంతఃపురంలో, ఏడంతస్తుల మేడలో, పై అంతస్తున, విచ్చుకత్తుల వాళ్ళ పహరాలో రక్షించబడే రాజుకూతురిని కథానాయకుడు చూడాలి, ఎట్లా? పేదరాసి పెద్దమ్మ కథానాయకుణ్ణి తనవెంట తీసుకుపోతుంది. "వీడు మా చెల్లెలి కొడుకు" అని పేదరాసి పెద్దమ్మ చెబితే చాలు, కోటలో అడ్డేవారుండరు.

పేదరాసి పెద్దమ్మ ప్రయాణీకులకూ, దూరదేశంవారికీ తిండిపెట్టి జీవించే సామాన్యురాలు. కాని ఆమెకు యెవరి ఎక్కువాలేదు. ఆమె నేరుగా రాజుగారితో మాట్లాడుతుంది, రాణిగారితో మాట్లాడుతుంది. ఆమెనెవరూ అనుమానించరు, అవమానించరు. ఆమె సర్వస్వతంత్రురాలు. అందుకే మనకు పేదరాసి పెద్దమ్మను చూస్తే సంతోషం. 

పేదరాసి పెద్దమ్మ ప్రతివిషయంలోనూ జోక్యం కలిగించుకుంటుంది. ఎవరికీ అపకారం చెయ్యదు. అందరిమంచీ ఆమెకే అందరికన్నా బాగాతెలుసు. కథానాయకుణ్ణి చంపించటం తనకు క్షేమమనీ తన కూతుర్ని వాడు చేసుకోవటం అపకారమనీ రాజుగారు పొరపడవచ్చు. కాని నిజం పేదరాసి పెద్దమ్మకు తెలుసు. ఆవిడ తాత్కాలికంగా రాజుగారిని మోసం చేసినా, ఆ మోసంవల్ల రాజుగారికెంతో ఉపకారమే జరుగుతుంది. 

ఎంతోమందికి ఎన్నోరకాల ఉపకారం చేస్తుంది కానీ పేదరాసి పెద్దమ్మ స్వార్ధం కోరదు. ఆమెకు డబ్బు అవసరం లేదు. అందరూ కులాసాగా ఉండటమే ఆమెకు కావలసింది. ఆమెకు ప్రతిబంధకాలు లేవు, భర్త లేడు, పిల్లలు లేరు, పెద్ద డబ్బు లేదు, భవంతులు లేవు. ఆమె ఏమో, ఆమె హోటలేమో! అది నాలుగుకాలాలపాటు సాగుతూ ఉంటే, తనదగ్గరికి వచ్చినవారికి ఇంత ఉపకారం చెయ్యటంకంటే పేదరాసి పెద్దమ్మకు కావలిసింది లేదు. 

తనమూలంగా ఇంకొకడికి రాజ్యం వచ్చినా, చక్కని చుక్క అయిన రాజుకూతురు భార్యగా దొరికినా పేదరాసి పెద్దమ్మ తనకు దొరికినంతగా సంతోషిస్తుంది. తనకేమీ పేచీలు లేకపోయినా ఇతరుల పేచీలు సరిదిద్దుతుంది. తాను సామాన్యప్రజలో జత అయిన మనిషే అయినా అన్నితరగతులవాళ్ళకూ ఆశ్రయమిస్తుంది. తనధర్మాన గొప్పవాళ్ళయినాక వారిదారిన వారిని పోనిస్తుందేగాని వారి వెంటపడి తానొక ఘరానా మనిషి కావటానికి ప్రయత్నించదు.

డబ్బు విషయాలలో కూడా ఆమె ఎప్పుడూ పేచీలు పెట్టదు. ఏవేళకు వచ్చినా అన్నార్తులకింత తిండిపడేస్తుంది. కొందరు మాసాల తరబడి తన ఇంటనే ఉంటారు. కొందరు వరహాలిస్తారు, కొందరు ఏమీ ఇవ్వరు. అందరినీ పేదరాసి పెద్దమ్మ సమంగానే చూస్తుంది. ఎవరు తన ఇంటికి అతిథిగా వచ్చినా వారిపని పూర్తి అయేవరకు వాళ్ళను పొమ్మనదు. ఆమె దగ్గరికి చేరి అసంతృపి పొందే మనిషి అంటూ ఉండదు.

అటువంటి అద్భుతమయిన వ్యక్తి పేదరాసి పెద్దమ్మ.

కలవారి కోడలు

(1948 జనవరి చందమామ నుంచి)

కలవారి కోడలు కలికి కామాక్షి
కడుగుచున్నది పప్పు కడవలో పోసి
అప్పుడే ఏతెంచె ఆమె పెద్దన్న
కాళ్ళకు నీళ్ళిచ్చి కన్నీరు నింపె

"ఎందుకో కన్నీరు ఏమి కష్టమ్ము?
తుడుచుకో చెల్లెలా, ముడుచుకో కురులు,
ఎత్తుకో బిడ్డను, ఎక్కు అందలము,
మీ అత్తమామలకు చెప్పిరావమ్మ."

"కుర్చీపీట మీద కూర్చున్న అత్త,
మా అన్నలొచ్చారు మము బంపుతార?"
"నేనెరుగ నేనెరుగ, మీమామ నడుగు!"

"పట్టెమంచము మీద పడుకున్న మామ,
మా అన్నలొచ్చారు మము బంపుతార?"
"నేనెరుగ నేనెరుగ, మీబావనడుగు!"

"భారతము చదివేటి బావ, పెదబావ,
మా అన్నలొచ్చారు మము బంపుతార?"
"నేనెరుగ నేనెరుగ, మీఅక్కనడుగు!"

"వంట చేసే తల్లి ఓ అక్కగారూ,
మా అన్నలొచ్చారు మము బంపుతార?"
"నేనెరుగ నేనెరుగ, నీభర్తడుగు!"

"రచ్చలో వెలిగేటి రాజేంద్రభోగి,
మా అన్నలొచ్చారు మము బంపుతార?"
"పెట్టుకో సొమ్ములూ, కట్టుకో చీర,
పోయిరా సుఖముగా పుట్టింటికిని.


Monday, April 2, 2018

చదువుకున్న కాకిపిల్ల


అనగా అనగా ఒక కాకి. దానికొక పిల్ల. ఈ రోజుల్లో అందరిపిల్లలూ చదువుకుంటూ వుంటే నాపిల్లకి మాత్రం ఏమితక్కువని కాకి, పిల్లని బడికి పంపి చదువు చెప్పించింది. గొంతు బాగున్నవాళ్ళూ, బాగులేనివాళ్ళూ కూడా సంగీతం నేర్చుకోవడం చూసి, నా కూతురికి సంగీతం చెప్పిస్తానని కాకి, పిల్లకి సంగీతం చెప్పించింది. అందం ఉన్నవాళ్ళూ, లేనివాళ్ళూ కూడా నాట్యం నేర్చుకుంటూఉంటే, నా పిల్లమాత్రం తీసిపోయిందా ఏమిటని కాకి, పిల్లకు నాట్యం నేర్పించింది. ఇలా మూడు విద్యల్లో కాకి తన పిల్లని తయారుచేసింది. ఎలాగైనా, కాకిపిల్ల కాకికి ముద్దుగదా!

ఇలా వుంటూండగా, కాకిపిల్ల ఒకరోజున ఒక మాంసమ్ముక్క తెచ్చుకొని, చెట్టుకొమ్మమీద కూచుని నములుతోంది. అది ఒక నక్క చూసింది. నక్కకి జిత్తులు పుట్టుకతో వచ్చిన బుద్ధులు కదా. కాకిపిల్లను మోసంచేసి, ఎలాగయినా ఆ మాంసమ్ముక్క కాజేద్దామనుకుంది.

కాకిపిల్ల కూచున్న చెట్టు దగ్గరికి వెళ్ళి కాకిపిల్లను చూసి, "ఏం మరదలా, బాగా చదువుకుంటున్నావా?" అని అడిగింది. కాకిపిల్ల చదువులు నేర్చిందికదా? అంచేత నక్కజిత్తులు దానికి తెలుసు. పైగా, పూర్వం ఒక నక్క, ఒక కాకిని మోసంచేసి దానినోట్లో వున్న మాంసం ముక్కను కాజెయ్యడం కథకూడా కాకిపిల్ల రెండోక్లాసులో చదువుకుంది.

అంచేత నక్కమోసం కాకిపిల్లకి తెలుసు. నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెపితే, తను నోరు తెరవాలిసి వస్తుంది. అప్పుడు నోట్లో మాంసం ముక్క కిందపడిపోతుంది. దానిని కాస్తా నక్క నోట్లో వేసుకుపోతుంది. ఆ సంగతంతా కాకిపిల్ల చదువుకున్నది కనుక, ఆలోచించుకుని, నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా అవునని తల ఊపింది.

నక్క తన ఎత్తు సాగలేదని, ఇంకా కొంచెం పెద్ద ఎత్తు వేద్దామనుకున్నది. "మరదలా, నువ్వు సంగీతం నేర్చుకున్నావుట, బాగా పాడగలవుట, నాకు సంగీతం అంటే చాలా యిష్టం. ఒక పాట పాడు మరదలా." అంది నక్క.

పొగడ్త అంటే ఎవరైనా చెవికోసుకుంటారు కదా! నక్క పొగడ్తకు కాకిపిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది. అయితే, చదువుకున్న కాకిపిల్ల కదూ! అంచేత నోట్లో ఉన్న మాంసమ్ముక్కను ముందుగానే తన కాలిగోళ్ళతో తీసి పట్టుకుని పాట పాడింది.

నక్క కోరిక పాపం, ఈసారీ నెరవేరలేదు. కాకిపిల్లను మోసంచెయ్యడం ఎలాగా అని ఆలోచించి, ఇంకాస్త పెద్ద యెత్తు వేద్దామని, ఇలా అంది. "మరదలా, ఎంత బాగా పాట పాడేవే! ఆహాహా, నా చెవుల తుప్పు వదిలిపోయిందే! కాని, ఇంకొక్క కోరిక కూడా తీరుద్దూ. నువ్వు నాట్యం నేర్చుకున్నావుట. చాలా బాగా నాట్యం చేస్తావుట. ఒక్కసారి నాట్యం చేద్దూ, చూసి ఆనందిస్తాను."

ఈమాటలు వినేటప్పటికి కాకిపిల్ల ఉబ్బితబ్బిబ్బయిపోయింది. తన సంగీతాన్నీ నాట్యాన్నీ మెచ్చుకునేవాళ్ళు ఎవరూ లేరనుకుంటూ వుంటే, నక్కబావ యింతగా మెచ్చుకుంటున్నాడు. నక్కబావను సంతృప్తి పరచాలనుకుంది. అయితే మరి, మాంసమ్ముక్క మాటో? చదువుకున్న కాకిపిల్ల కదా! అంచేత, ఆహారం విషయంలో అజాగ్రత్త పనికిరాదని దానికి తెలుసు.

అందుకని బాగా ఆలోచించి గోళ్ళతో పట్టుకున్న మాంసమ్ముక్కను మళ్ళీ నోట్లో పెట్టుకుని, నాట్యం చేసింది.

కాకిపిల్ల నాట్యంచేస్తూవున్నంతసేపూ, నక్కకు ఒకటే ఆలోచన. ఆ మాంసమ్ముక్కనెలా కాజేద్దామా అని. ఇంతకూ దాని ఎత్తు పారనేలేదు. కాకిపిల్ల నాట్యం అయినతరువాత నక్క ఆఖరి యెత్తు వేద్దామని, ఇలా అంది. "మరదలా! ఆహాహా. ఎంత మంచి పాట పాడావు, ఎంత బాగా నాట్యం చేశావు! నిజంగా ఇవ్వాళ నాకు సుదినం. అయితే, ఇంకొక్క చిన్న కోరిక వుంది. ఆకాస్తా తీర్చావంటే, అపరిమితమయిన ఆనందంతో ఇంటికి వెడతాను. ఇవ్వాళ నేను పొందే తృప్తికి, ఇహ నాకు యీనాటికి అన్నంకూడా అక్కరలేదు. అయితే మరదలా, ఆ కోరిక ఏమిటంటే, నీ ఆటా నీ పాటా కలిసి చూడాలనివుంది. పాటపాడుతూ నాట్యంచెయ్యి మరదలా! హాయిగా ఆనందిస్తాను."

కాకిపిల్ల, నక్కపొగడ్తకు చెప్పలేనంత పొంగిపోయింది. కాని పాటపాడుతూ నాట్యం చేస్తే, మాంసమ్ముక్కని ఏం చెయ్యాలి? చదువుకున్న కాకిపిల్ల కదా! ఆలోచించి నక్కబావతో ఇలా అంది.

"నక్కబావా! పాడీ, నాట్యంచేసీ ఇప్పటికే అలసిపోయాను. ఇంకా పాటపాడుతూ నాట్యంచెయ్యాలంటే, వంట్లో శక్తి ఉండాలి కదా! అంచేత, యీ మాంసమ్ముక్కను కాస్తా తిని, నీ కోరిక తీరుస్తాను వుండు."

ఈ మాటలు వినేటప్పటికి నక్కకు, ఇక లాభం లేదనిపించింది. ఆ మాంసమ్ముక్క కోసమే కదా కర్ణకఠోరమైన కాకిపిల్ల పాట విన్నదీ, అసహ్యమైన నాట్యాన్ని చూసిందీ అనుకొని, "మరదలా, మళ్ళీ వస్తాను. ఈలోపల నువ్వు మాంసమ్ముక్క తినడం కానీ" అని చెప్పి బయలుదేరింది.

కానీ కాకిపిల్ల అంతటితో వదులుతుందా? మాంసమ్ముక్క గుటుక్కున మింగి, పోతున్న నక్కబావని నిలేసి, సంగీతం పాడుతూ నాట్యం చెయ్యసాగింది. నక్కబావకి బుద్ధి వచ్చింది.



Wednesday, September 5, 2012

చందమామ పాట


చందమామ చందమామ - ఓ చందమామా!
చందమామ కూతురు - చంద్రగిరి కన్నె
చంద్రగిరి కన్నెకు - నిండుపూలతోట
పూసింది మున్నూరు - పూవుల్ల తోట
కాసింది మున్నూరు - కాయల్ల తోట
పండింది మున్నూరు - పండుల్ల తోట
అందులో ఒక పండు - అందమయిన పండు
ఆ పండు దాపున - జీడిగింజ మొలచె
జీడిగింజ జిడ్డి తలుపు - నే తీయలేను
నా కంటే నా చెల్లి - అతి ముద్దరాలు
అతి ముద్దరాలి చేత - పాలు కాగపెడితే
పాలు మీద తేలింది - పగడాలపేరు
పగడాలపేరు తెచ్చి - కోమటింట పెడితే
కోమటోడు పెట్టాడు - గోరంచు చీరె
ఊరివారు పెట్టారు - ఉల్లిమళ్ళ చీరె
మావారు పెట్టారు - మల్లిమొగ్గల చీరె.

Thursday, January 20, 2011

అంతా మన మంచికే (చందమామ కథ కాదు, మన సొంతం)


అనగనగా ఒక రాజ్యం. దానికో రాజుగారు. రాజుగారి కొలువులో ఒక విదూషకుడుండేవాడు. విదూషకుడు మంచి తెలివైనవాడు, చతురుడు, దైవభక్తి కలిగినవాడూను. దేవుడిమీద భారం వేసి, ఏం జరిగినా అంతా మన మంచికే అని నమ్మేవాడెప్పుడూను. రాజుగారికీ విదూషకుడికీ మంచి స్నేహం.



ఇలా ఉండగా ఒకనాడు రాజుగారి కొలువుకి పర్షియా దేశం నుంచి ఒక అరబ్బీ వర్తకుడొచ్చాడు. ఇరవై గుర్రాల మీదా, ఇరవై ఒంటెల మీదా చిత్రవిచిత్రమైన సామాన్లు పట్టుకొచ్చాడతను, మన రాజుగారికి చూపించడానికి. రుబ్బురోలు పొత్రాలంతంత రత్నాలు, రయ్యిన గాల్లో ఎగిరే తివాచీలు, ముత్యాలు కుట్టిన పరదాలు, బంగారపు తీగలతో నేసిన కంబళ్ళు, పొడుగాటి కత్తులు, ఒక వెంట్రుకను నాలుగు వెంట్రుకలుగా చీల్చేటంత పదునైన కటార్లు, మనుషులని మరుగుజ్జులుగా చూపించే అద్దాలు, మీట నొక్కితే ఆడే పాడే బొమ్మలు, చెవిలో పెట్టుకుంటే ఊరవతల ఎవరో మాట్లాడుకునే మాటలు కూడా ఇక్కడికి వినపడే శంఖాలు, ఇలాంటివన్నీను. 


రాజుగారు సరదాపడి అరబ్బీ వర్తకుడు తెచ్చిన కత్తినొకదాన్ని పరీక్ష చెయ్యబోయారు. ఇంకేముంది, పదునైన కత్తి మొనకి రాజుగారి చిటికెనవేలు తగిలి కోసుకుపోయింది. బొటబొటా నెత్తురు కారిపోయింది. పక్కనే ఉన్న రాణీగారు, అయ్యయ్యో ఎంత పని జరింగిందీ అంటూ చీర చెంగు సర్రున చింపి గబగబా వేలికి కట్టు కట్టేసారు. రక్తమైతే ఆగింది గానీ పాపం రాజుగారికి బోల్డంత నొప్పెట్టింది. పక్కనే ఉన్న విదూషకుడు చూసినవాడు చూసినట్టు ఊరుకోకుండా, "అంతా మన మంచికే" అనేసాడు అలవాటు చొప్పున. ఇంకేముంది, రాజుగారికి వొళ్ళు మండిపోయింది. అసలే వేలు తెగిన నొప్పిమీదున్నవాడికి "అయ్యో పాపం" అనకుండా, "బాగానే అయ్యింది" అంటే కోపం రాదూ మరి? పైగా రాజుగారాయె. కత్తికి తెలీదనుకో రాజుగారని, విదూషకుడికి తెలియద్దూ? "ఎవరక్కడ?" అని ఒక్క కేక పెట్టారు రాజుగారు. "చిత్తం ప్రభూ!" అని ఇద్దరు భటులు పరిగెట్టుకుంటూ వచ్చారు. "ఈ విదూషకుణ్ణి పట్టుకెళ్ళి చెరసాల్లో పడెయ్యండి" అని ఆఙ్ఞాపించేసారు రాజుగారు. అప్పుడైనా ఊరుకోవాలా విదూషకుడు? "అంతా మన మంచికే" అనేసి భటుల వెంట వెళ్ళిపోయాడు.



మరునాడు రాజ్యంలో ఉన్న పల్లె ప్రజలు కొంతమంది రాజుగారి దర్శనం చేసుకుని, "మా పల్లెల పక్కనున్న అడవుల్లోంచి పులులొచ్చి మా మేకలని ఎత్తుకుపోతున్నాయి మారాజా. మీరొచ్చి పులుల్ని వేటాడి మమ్మల్ని కాపాడాలి" అని మొర పెట్టుకున్నారు. రాజుగారు సరేనని చెప్పి, పరివారంతో మరునాడు వేటకు బయలుదేరారు. రోజంతా పులుల్ని వేటాడి వేటాడి రాజుగారు, పరుగెత్తి పరుగెత్తి రాజుగారి గుర్రం అలిసిపోయాయి. నెమ్మదిగా వెనకబడిపోయి పరివారం నుంచి వేరైపోయారు. రాత్రైపోయింది. కళ్ళు పొడుచుకున్నా కనపడని చిమ్మ చీకటి. దారి తప్పిన రాజు గారు ఒక కొండ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ కొండల్లో నరబలులిచ్చే కొండజాతి వాళ్ళుంటారు. ఆ ప్రాంతంలో తిరుగాడుతున్న రాజుగారు ఆ కొండజాతి వాళ్ళకి చిక్కిపోయారు. ఇంకేముంది? రాజుగారికి పూసల దండలు, పూల దండలేసి బాగా అలంకరించి కొండదేవత విగ్రహం ముందుకి తీసుకుపోయారు బలివ్వడానికి. కొండజాతివాళ్ళ గురువు "పూజకి తెచ్చిన పండు పుచ్చులు దెబ్బలు లేకుండా ఉందో లేదో చూడండర్రా" అన్నాడు. వెంటనే కాగడాలు తెచ్చి వాళ్ళు రాజుగారి వొళ్ళంతా పరీక్ష చేసారు. వాళ్లల్లో ఒకడికి తెగి కట్టు కట్టి ఉన్న రాజుగారి వేలు కనబడింది. "ఈ పండు పనికిరాదు దేవరా.. దీనికి దెబ్బ తగిలింది" అని అరిచాడు వాడు. రాజుగారి కట్లు విప్పేసి, మళ్ళీ అడవిలో వదిలేసారు వాళ్ళు. బ్రతుకుజీవుడా అనుకుని పడుతూ లేస్తూ ఎలాగో తెల్లారేసరికి ఒక పల్లె చేరి అక్కణ్ణుంచి అంచెలమీద రాజధాని చేరుకున్నారు రాజుగారు.



రాజభవనానికి చేరగానే విదూషకుడిని చెరసాల నుంచి విడుదల చేయించారు. "విదూషకా, ఏం జరిగినా మన మంచికే అని నువ్వన్నది మా విషయంలో నిజమయ్యింది. ఆనాడు వేలు తెగుండకపోతే మా ప్రాణాలే పోయేవి. తెలుసుకోలేక నిన్ను చెరసాలలో పెట్టాము మమ్మల్ని మన్నించు" అన్నారు రాజుగారు. "మహాప్రభో! మీరు చెరసాలలో పెట్టడం వల్ల నాక్కూడా మంచే జరిగింది" అన్నాడు విదూషకుడు. అదెలాగన్నారు రాజుగారు. "మీరు నన్ను చెరలో పెట్టించకపోయుంటే మీతో పాటు నేను కూడా వేటకి వచ్చుండేవాడిని. కొండజాతివాళ్ళకి ఇద్దరమూ దొరికిపోయేవాళ్ళం. దెబ్బ తగిలిన మిమ్మల్ని వదిలేసి బావున్న నన్ను కొండదేవతకి బలి ఇచ్చేసుండేవాళ్ళు. చెరసాలే నా ప్రాణాలు కాపాడింది" అని చెప్పాడు విదూషకుడు.



కాబట్టి పిల్లలూ, "ఏం జరిగినా అంతా మన మంచికే"

Monday, April 13, 2009

మే మే మేకపిల్ల

అనగనగా ఉఫ్ ఫ్ అని ఒక ఎర్రటి మేక ఉండేది. ఆ మేకకు నాలుగు పిల్లలు పుట్టాయి. నాలుగు పిల్లలలోనూ మూడు తల్లి పోలిక. కడసారిది మాత్రం కారు నలుపు. దీనికి మేమే-మేకపిల్ల అని పేరు. ఈ సంతతిలో మూడు పిల్లలూ తల్లి చెప్పిన మాట విని బుధ్ధిగా ఉండేవి. కానీ మేమే-మేకపిల్ల మాత్రం గడుగ్గాయిగా తిరుగుతూ తగని అల్లరి చేస్తూ ఉండేది. ఇంటి మీదకి రోజుకొక తగువు తెచ్చేది.

ఒక రోజున మేమే-మేకపిల్ల తల్లి దగ్గరికి వెళ్ళి, "అమ్మా అమ్మా! నాకు ఢిల్లీ సుల్తానుని చూచి రావాలెనని ఉన్నది. మనిద్దరం కలిసి వెళదాము. లే, బయలుదేరు" అన్నది.

దానికి తల్లిమేక "పాపా! ఇప్పుడు నాకు చేతి నిండా బోలెడంత పని ఉన్నది. అదీ గాక, ఇంత చిన్నవాళ్ళేమిటి, ఢిల్లీ వెళ్ళడమేమిటి, సుల్తానుని చూడడమేమిటి? మీరు పెద్దవాళ్ళయిన తరవాత అందరం కలిసి వెళదాములే" అని చెప్పింది.

"ఆ( ? పెద్దయేవరకూ ఎవరు ఆగుతారేమిటి? వస్తే ఇప్పుడు రండి, లేకపోతే పొండి. మీ ఇష్టం. ఇదుగో నేను బయలుదేరి పోతున్నాను", అని మేమే-మేకపిల్ల రోడ్డు మీదకి పరుగెత్తింది.

అటువంటి అల్లరి పిల్లలతో ఏం చేసేది? "సరే అనుభవించు. నీ ప్రారబ్ధం. నిన్ను కన్నాను గానీ నీ రాతను కనలేదు గదా" అని విచారించింది తల్లి మేక.

మేమే-మేకపిల్ల పాడుకుంటూ గెంతులేస్తూ పోతూవుండగా దారిలో ఒక యేరు అడ్డం వచ్చింది. ఏరు మేకపిల్లను చూసి, "మేకపిల్లా మేకపిల్లా! నా పైన ఎవరో కొమ్మ అడ్డం పడవేసి పోయినారు. అది నాకు బరువైపోయి నడవలేకుండా ఉన్నాను. దానిని కాస్త నమిలేసి పో తల్లీ, నీకు పుణ్యం ఉంటుంది" అని బతిమాలింది.

"పాపం, రమ్మన్నారు తిమ్మన్న బంతికి. కొమ్మలు తినడమే పని అనుకున్నావా నాకు? ఢిల్లీకి పోవాలి, సుల్తానుని చూడాలి. ఇప్పుడు నాకు తీరిక లేదు" అని చెప్పేసి మేమే-మేకపిల్ల మళ్ళీ పాడుకుంటూ గెంతుకుంటూ వెళ్ళిపోయింది.

మరి కొంత దూరం వెళ్ళేసరికి, ఒక మండుతున్న మంట కనపడి, "మేకమ్మా మేకమ్మా! నేను ఆరిపోబోతున్నాను. అల్లదిగో నీ కాలిదగ్గర ఒక పుల్ల ఉంది. దాన్నిలా పడవేసి పో తల్లీ, నీకు పుణ్యముంటుంది" అని బతిమాలింది.

"ఈ పుల్ల పడేస్తాననుకో, ఎల్ల కాలం మండుతూనే ఉంటావా? మళ్ళీ ఇంకో పుల్ల వెయ్యమంటావు. నాకిదే పననుకున్నావా యేం? ఢిల్లీ పోయి సుల్తానుని చూడాలి నేను. నాకిప్పుడు తీరిక లేదు" అని చెప్పేసి మేమే-మేకపిల్ల పరుగెత్తిపోయింది.

మర్కొంచెం దూరం పోయేసరికి, ఒక చెట్టుకింద గాలి కనపడింది. "మేకపిల్లా మేకపిల్లా! ఈ చెట్టుకి ఎవళ్ళో ముళ్ళాకంచె కట్టారు. అది నా వీపుకి గుచ్చుకుంటున్నది. ఊపిరి పీల్చుకోలేకుండా ఉన్నాను. దాన్ని కాస్త లాగిపారెయ్యి తల్లీ. నీకు బోలెడు పుణ్యమొస్తుంది" అని బతిమలాడింది గాలి.

"ఢిల్లీ పోయి సుల్తానుని చూసే పనిలో ఉన్నా నేనిప్పుడు. ఆగడానికి వల్ల కాదు. నీ తిప్పలు నువ్వు పడు" అనేసి గంతులేసుకుంటూ వెళ్ళిపోయింది మేమే-మేకపిల్ల.

వెళ్ళి వెళ్ళి మేమే-మేకపిల్ల చివరికి ఢిల్లీ సుల్తాను కోట చేరుకున్నది. ఆ దారిని పోతూవున్న మనిషిని పిలిచి "సుల్తాను ఎక్కడ వున్నాడు? నేను చూడాలి" అని అడిగినది. అతను సుల్తాను గారి వంటల సాయిబు. "రా, రా, నీకు సుల్తాను గారు కావాలా? నేను చూపిస్తాను రా" అంటూ పకపక నవ్వి మేమే-మేకపిల్లను వంటింట్లోకి లాగుకొనిపోయాడు. అతను పొయ్యి రాజవేసి, పెద్ద డేగిశాడు నీళ్ళూ పెట్టి, అందులో మేకపిల్లని ఉంచి, డేగిశా మూసిపోయాడు.

పాపం, మేమే-మేకపిల్లకి భయం పట్టుకుంది. నీళ్ళవైపు చూసి, "నీళ్ళూ, నీళ్ళూ! మీరు కాగబోకండి. మీరు కాగారంటే నేను ఉడికి చచ్చిపోతాను" అని బతిమాలింది.

"మాకు కష్టం వచ్చినప్పుడు ఆర్చావా? తీర్చావా? మేము కాగేది కాగేదే" అని నీళ్ళు బుడ బుడ కాగడం మొదలుపెట్టాయి.

అప్పుడు మేకపిల్ల నిప్పువంక చూసి, "నిప్పా నిప్పా! నువ్వు రాజుకోవద్దు. నువ్వు మండినావంటే నేను వొళ్ళూ కాలి చచ్చిపోతాను" అని బతిమలాడింది.

"ఒక పుల్ల వేస్తే కలకాలం మండుతావా అని నన్ను ఎద్దేవా చేసావు కదా, నేను మండక మానుతానా?" అనేసి నిప్పు భుగ భుగ మండసాగింది.

చివరకు మేకపిల్ల గాలితో "గాలీ, గాలీ! నువ్వు వీచవద్దు. నీవు వీచితే నిప్పు మండుతుంది.నిప్పు మండితే నీళ్ళు కాగుతై. నీళ్ళు కాగితే నేను వళ్ళు కాలి చచ్చిపోతాను. నా మీద దయ తలచవా?" అని బతిమాలింది.

గాలికి మేకపిల్ల మీద జాలి కలిగింది. "ఇందాక దారిలో నేను నిన్ను సహాయం చెయ్యమని అడిగితే 'అబ్బో నాకు పని వుందీ అని పరిగెత్తుకు పారిపోయావ్. ఇప్పుడు నీకే నా సహాయం కావలసొచ్చింది, చూసావా పాపా! ఏ వేళకు ఎవళ్ళ అవసరం వస్తుందో! అందుచేత ప్రపంచంలో ఎవళ్ళతోనూ విరోధం పెట్టుకోకూడదు. ఇప్పుడైనా ఇంక బుధ్ధి తెచ్చుకుని, వీలైనప్పుడల్లా ఒకళ్ళకు ఉపకారం చేయటం నేర్చుకో. మిడిసిపడి ఎవళ్ళమాటా నిర్లక్ష్యం చెయ్యకు" అని అనేకవిధాల బోధచేసి గాలి వీచటం మానేసింది. గాలి కదలకుండా వుండేసరికి మంట ఆరిపోయింది. మంట ఆరిపోయేసరికి నీళ్ళు చల్లబడిపోయాయి.

ఇంతలో వంటల సాయిబు వచ్చి మళ్ళీ డేగిశా కిందకి దింపి, నీళ్ళు ఎంత వెచ్చబడ్డాయో చూతామని మూత తీశాడు. మూత తీసీతీయడంతోనే మేమే-మేకపిల్ల గభీమని డేగిశాలోంచి దూకి తుర్రుమని ఇంటికి పారిపోయింది. ఇంటికి వెళ్ళి మేకపిల్ల జరిగినదంతా తల్లితో చెప్పింది.

పాపకు గండం తప్పినందుకూ, గాలి బోధవల్ల పెంకితనం అణగి బుధ్ధి వచ్చినందుకూ తల్లి చాలా సంతోషించింది.

కథ కంచికి మనమింటికి.

Thursday, March 5, 2009

శ్రీ సూర్య నారాయణా !


శ్రీ సూర్య నారాయణా మేలుకో
హరి సూర్య నారాయణా !

పుట్టేటి భానుడూ, పుష్యరాగపుచాయ
పుష్యరాగము మీద పొంగు బంగరుచాయ

శ్రీ సూర్య నారాయణా మేలుకో
హరి సూర్య నారాయణా !

జామెక్కి భానుడూ జాజిపువ్వులచాయ
జాజిపువ్వుల మీద సంపెంగపువుచాయ

శ్రీ సూర్య నారాయణా మేలుకో
హరి సూర్య నారాయణా !

మధ్యాహ్న భానుడూ మల్లెపూవులచాయ
మల్లెపూవుల మీద మంచి వజ్రపుచాయ

శ్రీ సూర్య నారాయణా మేలుకో
హరి సూర్య నారాయణా !

ముజ్జాము భానుడూ మునగపూవులచాయ
మునగపువ్వుల మీద ముత్యాల పొడిచాయ

శ్రీ సూర్య నారాయణా మేలుకో
హరి సూర్య నారాయణా !

క్రుంగేటి భానుడూ గుమ్మడీపూచాయ
గుమ్మడీపువు మీద కుంకుమాపొడిచాయ

శ్రీ సూర్య నారాయణా మేలుకో
హరి సూర్య నారాయణా !

ఆయురారోగ్యములు ఐశ్వర్యములనిమ్ము
శ్రీ సూర్య నారాయణా మేలుకో
హరి సూర్య నారాయణా !